ఒకే కారును మూడుసార్లు దొంగిలించి మూడుసార్లు అమ్మేశారు

సాంబార్ సృజనాత్మకత 🙏🙏🙏

ఈ దొంగలు మామూలోళ్లు కాదు. ఒకే కారును మూడుసార్లు దొంగిలించి మూడుసార్లు అమ్మేశారు. అమ్మిన కారును తిరిగి కొట్టేసేందుకు వీరు వేసిన ప్లాన్ కూడా అలాంటి ఇలాంది కాదు. అమ్మడానికి ముందే కారుకు మారుతాళాలు చేయించారు. అంతేకాదు, అమ్మిన తర్వాత కారు ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలుసుకునేందుకు అందులో జీపీఎస్ అమర్చారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గురువారం ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని కణతూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

థనిగై అనే సినీ నిర్మాత తన కారు పోయిందంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది. సీసీటీవీ ఫుటేజీలు, థనిగై మొబైల్ రికార్డును పరిశీలించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని గణేశన్, భారతీలుగా గుర్తించారు.ఓ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకుని తాను నిందితులు ఐదుగురిని జూన్ 7న కలిసినట్టు థనిగై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారు తనకు రూ.6 లక్షలకు కారును అమ్మారని తెలిపాడు. అయితే, జూన్ 10న కణతూర్‌లోని తన గెస్ట్‌హౌస్ బయట కారును పార్క్ చేయగా చోరీకి గురైందని తెలిపాడు.

దర్యాప్తులో గణేశన్, భారతీ చెప్పిన విషయం విని పోలీసులు విస్తుపోయారు. నిందితులు తొలుత ఈ కారును నవనీతకృష్ణ అనే వ్యక్తికి విక్రయించారు. వారం తర్వాత తిరిగి దానిని దొంగిలించారు. రెండోసారి ఈ కారును వెల్లూరుకు చెందిన వ్యక్తికి విక్రయించారు. ఆ తర్వాత అతడి నుంచి కూడా దొంగిలించి థనిగైకి విక్రయించినట్టు నిందితులు తెలిపారు. వారి వద్ద మొత్తం 10 కార్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మిగతా నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.