నాగబాబు కు టికెట్..దొడ్డిదారిన కాదు మా అన్నని రాజమార్గంలో తీసుకొస్తున్నా – పవన్..!!

పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఈరోజు జనసేన పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీచేస్తారని పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ తనకు సోదరుడే కావొచ్చు. కానీ పార్టీలో చేరిన తనకు పవన్ ఓ నాయకుడని వ్యాఖ్యానించారు. ఆపీస్‌లో ఏ పని చెప్పినా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని నాగబాబు వివరించారు.

పార్టీలో చేరకముందే ఎలాంటి బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. జనసేన కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని ఇచ్చినా చేసేందుకు రెడీ అని చెప్పానన్నారు.

తనకు నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టి పవన్ గొప్ప గౌరవం ఇచ్చారన్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తి, బలం, ధైర్యంతోనే ఇటీవల తాను మాట్లాడానని స్పష్టం చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కల్యాణ్ కు నాగబాబు కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని తనకు చాలా కోరికగా ఉండేదని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు.

అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత వాటన్నింటిని వదిలేశానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినా తాను దూరంగానే ఉన్నాని చెప్పారు. తమ్ముడిని తమ్ముడిగా కాకుండా నాయకుడిగా చూడాలని తాను భావించానన్నారు. పవన్ కల్యాణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేత అని పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ కు తనకు వయసులో చాలా వ్యత్యాసం ఉందనీ, ఆయన్ను తాను ఎత్తుకుని ఆడించానని నాగబాబు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో క్యూట్ గా, ముద్దుముద్దుగా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు గొప్ప నాయకుడిగా మారాడని ప్రశంసించారు. పవన్ కల్యాణ్ విషయంలో ఇన్ వాల్వ్ కాకూడదని తమ ఫ్యామిలీ ఓ అవగాహనకు వచ్చిందన్నారు. పవన్ గతంలో తన ఫోన్లను ఎత్తేవాడు కాదనీ, ఎందుకొచ్చిందిలే అని భావించేవాడని నవ్వులు పూయించారు.