కడపలో వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్..!!

ప్రతి సినిమా విడుదలకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంటో, ఆడియో ఈవెంటో జరుగుతుంది. రాంగోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి ఇటువంటివి ఒకటీరెండూ కాదు అనేకం జరిగేలా వున్నాయి. ఇటీవలే ఒక ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించి హల్ చల్ చేసిన వర్మ.. త్వరలోనే మరో ఈవెంట్ కి ప్లాన్ చేశాడు. త్వరలో ఆడియో రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నానని.. దానికి ”వెన్నుపోటు’ అలియాస్ ఎన్టీఆర్ నైట్’ అని పేరు పెట్టినట్టు వర్మ తెలిపారు.’లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆడియో రిలీజ్ ఈవెంట్ కడపలో ఒక బహిరంగ సభలో చెయ్యబడుతుంది. దీని పేరు ‘వెన్నుపోటు’ అలియాస్ ఎన్టీఆర్ నైట్’. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియజేయబడుతుంది. జై ఎన్టీఆర్’ అని ట్వీట్‌లో వర్మ పేర్కొన్నారు. నిజంగా నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ ఆహ్వానం అంటూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు.. పిక్స్‌ను రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని ప్రేక్షకుల్లో బాగా పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.అటు.. ప్రొడ్యూసర్లు ప్రకటించినట్లు ఈ సినిమా మార్చి 22న విడుదల కావడం కష్టంగానే కనిపిస్తోంది. ఇంకా సినిమాకి సెన్సార్ జరగలేదు. మరోవైపు.. సినిమా విడుదలను ఆపాలంటూ నమోదైన ఫిర్యాదుని ఎన్నికల సంఘం కోర్టుకి నివేదించింది. కోర్టు కేసులు తేలితే కాని ఈ సినిమా రిలీజ్‌కి నోచుకోదు గనుక విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. ఈ గ్యాప్‌లో బాబుకి వ్యతిరేకంగా ఎంత రచ్చ చేయాలో అంతా చేసేందుకు చేసే స్కెచ్ వేశాడు వర్మ.