మెగా హీరో తెలుగమ్మాయే కావాలంటున్నాడు

వారసులు రంగ ప్రవేశం చేసేటప్పుడు ఎన్నో వెసులు బాట్లు ఉంటాయి. దర్శకులు, నిర్మాతలు వారికి అండగా ఉంటారు. వరస ఫ్లాప్‌లు వచ్చినా కొంత కాలం వరకు ఇబ్బంది లేదు. ఇక తమ వారసత్వంగా వచ్చే వీరాభిమానుల అండ పుష్కళంగా ఉంటుంది. ఇక విషయానికి వస్తే మెగా ఫ్యామిలీ నుంచి అందునా మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడుగా మెగాప్రిన్స్‌ అనే బిరుదుతో వరుణ్‌తేజ్‌ హీరోగా పరిచయం అయ్యాడు. తెలుగులో ప్రభాస్‌, రానాల వలే ఆరడుగుల ఆజానుబాహుడిగా, హీమ్యాన్‌గా ఆకట్టుకునే రూపం ఆయనది. ‘ముకుందా’తో ఫర్వాలేదనిపించుకున్నా తర్వాత ‘లోఫర్‌, మిస్టర్‌’ చిత్రాలతో దెబ్బతిన్నాడు.

కానీ క్రిష్‌ దర్శకత్వంలో ‘కంచె’ విభిన్న చిత్రంగా నిలిచింది. శేఖర్‌కమ్ముల-దిల్‌రాజుల ‘ఫిదా’లో సాయిపల్లవితో, ‘తొలిప్రేమ’లో రాశిఖన్నా, ‘అంతరిక్షం’తో ఆదితీరావు హైదరి, ‘ఎఫ్‌ 2’లో మెహ్రీన్‌లతో జోడీ కట్టాడు. ‘ఫిదా’ వంటి చిత్రంలో సాయిపల్లవితో డామినేషన్‌ అని పలువురు వ్యాఖ్యానించినా కూడా ఆయన తన చిత్రాలలో తన పాత్రే కాదు.. హీరోయిన్లు ఇతర పాత్రలలో కూడా మంచి నటీనటులు ఉండేలా చూసుకుంటున్నాడు.


ఇక ఇప్పుడు ఆయన తాజాగా తెలంగాణ పోరి, వరంగల్‌కి చెందిన ‘ఈషారెబ్బా’తో కలిసి నటిస్తున్నాడని సమాచారం. ‘ఎఫ్‌ 2’ ఊపులో ఉన్న వరుణ్‌తేజ్‌ మరోసారి తన వైవిధ్యం చూపిస్తూ నెగటివ్‌ షేడ్స్‌ ఉండే ‘వాల్మీకి’లో నటిస్తున్నాడు. హరీష్‌శంకర్‌-14రీల్స్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీ తమిళంలో బ్లాక్‌బస్టర్‌ సాధించిన ‘జిగర్‌ తాండా’కి రీమేక్‌. ఈ మూవీలో కూడా హీరోయిన్‌కి కేవలం గ్లామర్‌షో మాత్రమే కాదు… నటించడానికి ఎంతో టాలెంట్‌ ఉన్న పాత్ర కావడంతో హరీష్‌ శంకర్‌తోపాటు వరుణ్‌తేజ్‌ కూడా టాలెంట్‌ ఉన్న ఈషారెబ్బాకే ఓటు వేశారట.

ఇంతకాలం వరుణ్‌తేజ్‌ సరసన నటించిన హీరోయిన్లు అందరు వారసత్వ హీరో కాబట్టి మంచి క్రేజ్‌ ఉన్నవారే. కానీ ఈ చిత్రంలో ఈషారెబ్బాని తీసుకోవాలని వరుణ్‌ అనుకోవడం నిజంగా అభినందనీయం. గతంలో ఈషారెబ్బా ‘అ, అరవింద సేమత వీరరాఘవ’లో పూజాహెగ్డేకి చెల్లిగా పలు పాత్రలను పోషించి మెప్పించింది. మొత్తానికీ ఈ మూవీతో ఈ తెలుగమ్మాయికి దశ తిరుగుతుందేమో వేచిచూడాల్సివుంది…!