తమ్ముడినేంటి అలా వదిలేశాడు..?

మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవ్వరి తరము కాదు.. ఒక విషయంపై మౌనంగా ఉంటే అదే మౌనం కొన్నిసార్లు మంచి చేస్తుంది. కొన్నిసార్లు మాత్రం విమర్శకులకు పనిచెబుతుంది. ఇక విషయానికి వస్తే తెలుగులో అతి తక్కువ కాలంలో రౌడీస్టార్‌గా., సెన్సేషనల్‌ స్టార్‌గా ఎదిగిన హీరో విజయ్‌ దేవరకొండ, నిజానికి ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఆయన ఈ స్థాయికి చేరి చిరు, అరవింద్‌ల చేతనే కొత్తస్టార్‌ వచ్చాడు అనిపించుకోగలిగాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బహుశా తన తమ్ముడు తన పేరుతో కాకుండా సొంత టాలెంట్‌తో ఎదగాలని కోరుకున్నాడో మరో కారణమో తెలియదు గానీ ఇటీవల విడుదలైన ఆనంద్‌ దేవరకొండ నటించిన ‘దొరసాని’ టీజర్‌, పోస్టర్స్‌ గురించి మౌనం పాటించాడు.

అదే తాజాగా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ట్రైలర్‌ విడుదలైంది. స్వరూప్‌ దర్శకత్వంలో కామెడీ ప్లస్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈమూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మిలియన్‌ ఫాలోయర్స్‌ ఉన్న విజయ్‌ దేవరకొండ ఈ చిత్రం గురించి మాత్రం పొగడ్తలు గుప్పించాడు. దాంతో కోడి గుడ్డు మీద ఈకలు పీకే విమర్శకులు విజయదేవరకొండపై కారాలు మిరియాలు నూరుతున్నారు. స్వంత తమ్ముడి మొదటి చిత్రం కాబట్టి ప్రోత్సాహం ఇవ్వడంలో తప్పులేదు. బయటి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తూ సొంత తమ్ముడి చిత్రాన్ని పట్టించుకోకపోవడంఏమిటి? అంటూ ఆన్‌లైన్‌లో రచ్చ ప్రారంభించారు. అన్నట్లు ‘దొరసాని’ చిత్రంలో జీవిత, రాజశేఖర్‌ దంపతులు చిన్నకూతురు శివాత్మిక, ఆనంద్‌ దేవరకొండ ఇద్దరు దీని ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత అయిన యష్‌ రంగినేని స్వయంగా విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండలకు బంధువు. మరి విజయ్‌ దేవరకొండ ‘దొరసాని’ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడో అయనకే తెలియాలి.